గుంటూరు జిల్లా బాపట్లలో తనను పోలీసులు వేధించారంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా మందపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు(21) చిత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. దేశమంతటా లాక్‌డౌన్ విధించిన కారణంగా ద్విచక్ర వాహనంపై సొంతూరికి బయల్దేరాడు. గుంటూరు-ప్రకాశం జిల్లాల సరిహద్దులో పోలీసులు అడ్డుకుని అతడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా అతడిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ఒక రోజంతా అతడిని చాలా ఇబ్బందులు పెట్టినట్టు అతడు సూసైడ్ చేసుకోబోయే ముందు సెల్ఫీ వీడియో తీసి అందులోవివరించాడు. తన చావుకు పోలీసులే కారణమని వివరించాడు. పోలీసులు తనను అవమానించారన్న మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు.