నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. తన ఒక్కగానొక్క కూతురు అమృత అంటే ఆయనకెంతో ఇష్టం. కానీ తనకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లాడటంతో.. అల్లుడైన ప్రణయ్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ప్రణయ్‌ను కిరాయి ముఠాకు కోటి రూపాయల సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ ఘటన 2018 సెప్టెంబర్ 14న చోటు చేసుకుంది. తన బిడ్డ గర్భవతి అని తెలిసి కూడా అల్లుడిని కిరాయి హంతకులతో చంపించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. అల్లుడు లేకపోతే కూతురు తన వద్దకే తిరిగి వస్తుందనో లేక తన బిడ్డను తనకు దూరం చేసిన వ్యక్తి బతికి ఉండొద్దనే పగ కావొచ్చు.. కారణం ఏదైనా ప్రణయ్‌ను మట్టుబెట్టారు.
చిన్నతనం నుంచి ఎంతో అపురూపంగా పెంచుకున్న కూతురే.. తన భర్తను హత్య చేయించాడన్న కోపంతో కన్న తండ్రిపైనే కక్ష పెంచుకుంది. ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావుతోపాటు ఆయన సోదరుడు శ్రావణ్ కూడా జైలుకు వెళ్లారు. 2019 ఏప్రిల్‌లో బెయిల్ మీద బయటకొచ్చారు. ఒక్కగానొక్క కూతురి మీద అమితమైన ప్రేమ పెంచుకోవడం తప్పు కాదు. కానీ ఆమె తన అభీష్టానికి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో అల్లుడిని హత్య చేయించడం, అందులోనే ఆమె గర్భిణి అని తెలిసి కూడా ఈ దారుణానికి ఒడిగట్టడం మారుతీరావు చేసిన పెద్ద తప్పు.
ఈ మొత్తం వ్యవహారంలో తప్పంతా మారుతీ రావుదే అని చెప్పలేం. అలాగని అమృతనూ తప్పుబట్టలేం. ప్రణయ్ హత్య తర్వాత.. పెళ్లయిన కొత్తలో హల్‌చల్ చేసిన అమృత, ప్రణయ్ దంపతుల వీడియోలు, ఫొటోలు మారుతీ రావు కుటుంబానికి ముందే చేరి ఉండొచ్చు. తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి పక్కన తనకు ఇష్టం లేని మరో వ్యక్తిని చూసి మారుతీరావు తట్టుకోలేకపోయాడు. కూతురి మీద ప్రేమ కంటే అల్లుడి మీద ద్వేషం పెరిగిపోవడం. దాని ఫలితమే ప్రణయ్ హత్య. ఇప్పుడు కూడా మారుతీ రావు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తన కూతురి భర్తను హత్య చేయించడం ఎంత తప్పో.. ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే తప్పు.
ఒక తప్పు చేస్తే.. దాని పర్యవసానంగా మరో తప్పు చేయాల్సి వస్తుందనడానికి మారుతీ రావు ఘటనే ఉదాహరణ. మన దేశంలో ఎన్నో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఎందరో కూతుళ్లు తమ తండ్రుల అభీష్టాలకు వ్యతిరేకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కులమతాల పట్టింపులతో కన్న బిడ్డలను దూరం చేసుకున్నా కొంత కాలం తర్వాత మనసు మార్చుకుని కలిసిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. కానీ పరువు ప్రతిష్టలే ప్రాధాన్యం అనుకుంటూ మారుతీ రావు తీసుకున్న నిర్ణయాలతో ఆయన భార్య, కూతురు తీవ్రంగా నష్టపోయారు. ఇద్దరు మహిళలు తమ భర్తలను కోల్పోయారు.
అమృతకు కొడుకుతో పాటు అత్త, మామలు ఉన్నారు. కానీ మారుతీ రావు భార్య మాత్రం భర్తను కోల్పోయింది. ఉన్న ఒక్క కూతురితోనూ మాటల్లేవు. భవిష్యత్తులో ఆమె తల్లికి దగ్గరవుతుందా? లేక శాశ్వతంగా తల్లినీ దూరం పెడుతుందా అనేది ఆమె చేతుల్లోనే ఉంది. మారుతీరావులా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే.. ఎంతటి తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది సమాజానికి ఓ గుణపాఠం. పిల్లలు కూడా తాము ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం పెద్దలను ఒప్పించడానికి చివరి వరకూ ప్రయత్నించాలి. తాము చేసిన పనితో తమ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాము చేయబోయే పనులు వారిని మరింత ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి.