HomeTelugu Newsఏపీలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కరణ

ఏపీలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కరణ

10

ఆంధ్రప్రదేశ్‌లో నేడు చారిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ కొత్త రాజధాని అమరావతిలో హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన న్యాయమూర్తి, 14 మంది న్యాయమూర్తులతో విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ హాజరయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది.

ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్‌ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70 శాతం వరకు కేసులు
ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా… ప్రస్తుతం ఉన్న వారు 14 మంది.

సీఎం క్యాంపు కార్యాలయంలో 9 కోర్టు హాళ్లు సిద్ధం చేశారు. మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ కార్యాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తి సహా న్యాయమూర్తులంతా ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక హైకోర్టుకు చేరుకున్నారు. తమకు కేటాయించిన చాంబర్లలో ఆసీనులుకానున్నారు. 2వ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు విధులు నిర్వర్తిస్తారు. 5వ తేదీన సంక్రాంతి సెలవులు మొదలవుతాయి. అప్పటి నుంచి 21వ తేదీ వరకు వెకేషన్‌ కోర్టును నిర్వహిస్తారు. ఇది వారంలో రెండు రోజులపాటు పనిచేస్తుంది. ఈ నెలాఖరుకు రాజధాని అమరావతి పరిధిలోని జ్యూడీషియల్‌ కాంప్లెక్స్‌కు హైకోర్టు తరలి వెళుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu