భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితచరిత్ర ఆధారంగా బాలీవుడ్‌లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మన్మోహన్ సింగ్ పాత్ర పోషిస్తుండగా…. సోనియా గాంధీగా జర్మన్ యాక్టర్ సుజానే బెర్నెర్ట్ కనిపించనున్నారు. విజయ్ రత్నాకర్ గట్టీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.
మన్మోహన్‌ను ప్రధానిగా ఎంపిక చేసిన నాటి నుంచి రెండు పర్యాయాల పాటు ఆయన పదవిలో కొనసాగేందుకు దోహదం చేసిన అంశాలు, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పదవి కంటే కూడా దేశ శ్రేయస్సే ముఖ్యమంటూ అనుపమ్ చెప్పే డైలాగ్స్ మన్మోహన్ సింగ్ మనస్తత్వానికి అద్దం పట్టేలా ఉన్నాయి. అంతేకాకుండా మన్మోహన్‌ను మహాభారతంలోని భీష్మునిగా అభివర్ణించిన డైరెక్టర్…. కశ్మీర్ వివాదం, అణు ఒప్పందం ప్రక్రియలో భాగంగా పార్టీతో ఆయన విభేదించడం వంటి సున్నితమైన అంశాలను కూడా స్పృశించారు.కాగా యూపీఏ-1 హయాంలో మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు రాసిన వివాదాస్పద పుస్తకం.. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ : ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్‌సింగ్’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల సన్నాహకాలు మొదలవుతున్న వేళ ఈ చిత్రం విడుదల కానుండటం రాజకీయ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెంచుతోంది.
https://www.youtube.com/watch?v=q6a7YHDK-ik