తమిళ మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితపై ఓ బయోపిక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తలైవిగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ను రిలీజ్ చేస్తుంది మూవీ యూనిట్. ‘తలైవి’గా హిందీ నటి కంగనా రనౌత్ నటిస్తోండగా.. మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి స్టార్ హీరో ఎంజీ రామచంద్రన్ పాత్రలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఆ మధ్య విడుదలైన ఆయన లుక్‌కి విశేష స్పందన దక్కింది. ‘తలైవి’ని ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అది అలా ఉంటే జయలలిత, శోభన్ బాబు మధ్య ప్రత్యేకమైన అనుబంధం వుందని అభిమానులు అంటారు. ఆ విషయాలను కూడా ఈ సినిమాలో చర్చించనుంది చిత్రబృందం. అందులో భాగంగా శోభన్ బాబు పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
జిషు సేన్ గుప్తా తాజాగా తెలుగులో విడుదలైన ‘అశ్వద్ధామ’లో విలన్‌గా అదరగొట్టాడు. తలైవి తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోను విడుదల కానుంది. ఈ సినిమాను విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్‌తో కలిసి విబ్రీ మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు. జూన్ 26న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తోంది చిత్రబృందం.