జమ్మూ-కాశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడి ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అతిపెద్ద ఉగ్రదాడి. ఈ ఉగ్రవాద దాడిలో 30 మంది జవాన్లు మరణించారు. మరో 25 మందికి పైగా జవాన్లు గాయపడ్డారు. అయితే మృతులు, గాయపడినవారి సంఖ్యపై ఇంకా అధికారిక సమాచారం అందడం లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇంతకు ముందు 2016లో ఉగ్రవాదులు జమ్మూ-కాశ్మీర్ లోని ఉరి సెక్టార్ లో భారత సైన్యం ప్రాంతీయ కార్యాలయంపై భారీ ఎత్తున దాడి చేశారు. ఉరి దాడిలో 18 మంది సైనికులు అమరులయ్యారు. ఉరికి ముందు 2 జనవరి 2015న ఉగ్రవాదులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో 37 మంది గాయపడ్డారు. ఈ దాడితో మరోసారి ఉరి, పఠాన్ కోట్ ఘటనలు గుర్తుకొచ్చాయి.
పుల్వామాలో సీఆర్పీఎఫ్ పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా దళాలు, నిఘా సంస్థలు ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి తర్వాత జమ్మూ-కాశ్మీర్ సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. గత కొద్ది నెలలుగా నిఘా సంస్థలు ఉగ్రవాద దాడులపై వరుసగా హెచ్చరిస్తున్నాయి. నిఘా సంస్థల సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు రిపబ్లిక్ డేకి సరిగ్గా ముందు జమ్మూ-కాశ్మీర్, ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 మందికి పైగా ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నవారిని అరెస్ట్ చేశాయి.
ఉరి, పఠాన్ కోట్ దాడుల తర్వాత దేశం లోపల సైన్యం, ఇతర బలగాలు ప్రతి ఉగ్రవాద చర్యకు ధీటుగా జవాబిచ్చాయి. దీంతో ఉగ్రవాదుల ప్రతి కుట్ర విఫలమైంది. భద్రతా దళాలు కేవలం జమ్మూ-కాశ్మీర్ లోనే 2018లో సుమారుగా 230 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. భద్రతా బలగాల కఠిన చర్యల కారణంగా ఉగ్రవాద చర్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే
అత్యంత సున్నిత ప్రాంతమైన జమ్మూ-కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాను గత నెల ఉగ్రవాద రహిత జిల్లాగా ప్రకటించారు.