హైదరాబాద్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల.. సోమవారం భేటీ అయ్యారు. సుమారు 6 గంటల పాటు ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ సీఎం కేసీఆర్- ఏపీ సీఎం వైఎస్ జగన్‌లు పలు కీలక విషయాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా విభజన అంశాలు, తాజా రాజకీయాలపై చర్చించారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ ప్రగతి భవన్ నుంచి విజయవాడకు బయల్దేరి వెళ్లారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని అంశాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా నదిలో నీటి లభ్యతలో ప్రతీ ఏడాది అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నందున గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. 9, 10 వ షెడ్యూల్ లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగన్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు. పూర్తి సహృద్భావ వాతావరణంలో, పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.
”కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రతీ ఏడాది ఒకే రకంగా ఉండడం లేదు. చాలా సందర్భాల్లో కృష్ణా నది ద్వారా నీరు రావడం లేదు. దీంతో కృష్ణా నది ఆయకట్టులో ఉన్న రాయలసీమ, తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల రైతులు నష్టపోతున్నారు. పంటలకు సాగునీరు అందడం లేదు. పుష్కలమైన నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తరలించి, అవసరమైన సందర్భంలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఇవ్వడమే వివేకవంతమైన చర్య. దీనివల్ల అటు రాయలసీమ, ఇటు పాలమూరు, నల్గొండ వ్యవసాయ భూములకు ఖచ్చితంగా నీరు అందుతుంది. ఇప్పటికే సిద్దంగా ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉపయోగించుకుంటూనే గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించాలి. దీని వల్ల తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో అనుకున్న విధంగా గోదావరి నీటిని తరలించవచ్చు” అని ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో స్థిర నిర్ణయం కుదిరింది. గోదావరి నీటిని ఎక్కడి నుంచి ఎటు తరలించాలి? ఎలా వినియోగించాలి? దీనికి సంబంధించిన మోడల్ ఎలా ఉండాలి? అనే విషయాలపై తదుపరి సమావేశంలో మరింత విపులంగా చర్చించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు.