కరోనా వైరస్ వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా సినిమా హాళ్లు, విద్యా సంస్థలు, కళ్యాణమండపాలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, నిర్మాతల సంఘం సంయుక్తంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది. తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి షూటింగ్స్ నిలిపేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. సినిమా హాళ్లు కూడా ఈనెల 21వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు, ఆ తర్వాత దానిని 31 వరకు ఆ బంద్ పొడిగిస్తామని వెల్లడించారు.
కరోనాను ఆరికట్టడానికి మావంతు ప్రయత్నం గా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో నిర్మాతలకు కొంత నష్టం జరుగుతుంది. అయితే అది వారు భరించాలని పేర్కొన్నారు. తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సి వస్తే అభ్యంతరం లేని కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ చేసుకోవచ్చు అని సూచించారు. షూటింగ్‌లు జరుపుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించే వరకు ఎలాంటి షూటింగ్‌లు జరగవని వెల్లడించారు.