HomeTelugu Newsఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు: కేసీఆర్‌

ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరు: కేసీఆర్‌

13 15
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..విదేశాల నుంచి రాకపోకలను పూర్తిగా స్తంభింప చేశామని, కేంద్రం కూడా విమానాశ్రయాలు, ఎయిర్‌ పోర్టులన్నీ మూసివేసిందని తెలిపారు. అందువల్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని సీఎం అన్నారు. రాష్ట్రంలోనూ కొత్త కేసులు నమోదు కాకపోతే ఏప్రిల్‌ 7 తర్వాత కరోనా బాధితులే ఉండరని చెప్పారు. చికిత్స పొందిన 11మంది కరోనా బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్చార్జి చేస్తామని ఆయన వివరించారు. చికిత్స పొందుతున్న వారందరూ బాగానే కోలుకుంటున్నారని తెలిపారు. మొత్తం 25,935 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని 5,742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.

కరోనా వ్యాధిని నివారించడం పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అందరూ సహకరిస్తున్నారని, ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు. గండం నుంచి గట్టెక్కినట్లేని ఇప్పుడే సంబరపడవద్దని సీఎం హితవు పలికారు. ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదని, అందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఉన్నంతకాలం స్వీయనిర్భందంలో ఉండాలని కోరారు.

కరోనా నివారణలో భాగంగా గ్రామ సరిహద్దుల్లో గ్రామస్థులు ఏర్పాటు చేసిన కంచెలను తొలగించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. కంచెలు వేసినచోటే గంగాలం, నీళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తపడటం మంచిదేనని, అయితే పట్టు విడుపులతో కంచెలు తొలగించకపోతే సమస్యలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు రావొద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 14.50 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుబడి రైతుల చేతికి రావాల్సి ఉందని, మొక్క జొన్న ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ చెప్పారు.” మొక్కజొన్నకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేదు. అయినా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. రూ.3,200 కోట్లు మార్క్‌ఫెడ్‌కు హామీ ఇచ్చాం. మరోవైపు వరి..కోటి 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ప్రతి వరిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ మార్కెట్లన్నీ తాత్కాలికంగా మూసివేశాం. రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. రైతులంతా క్రమశిక్షణతో ప్రభుత్వానికి సహకరించాలి. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాలి” అని కేసీఆర్‌ అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu