రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లలో ఎన్నో అవరోధాలు అధిగమించామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైదారాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నామని ప్రకటించారు. రైతుబంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకానికి రైతు బంధు పథకమే ప్రేరణ అని వివరించారు. ప్రపంచంలోనే గొప్ప పథకంగా రైతు బంధు పథకాన్ని ఐరాస ప్రశంసించిందని గుర్తు చేశారు.
* దేశ చరిత్రలో ప్రత్యేక మహోద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించాం.
* 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
* ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు తిరుగులేని విజయం కట్టబెట్టారు.
* రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా తెలంగాణ నిలదొక్కుకుంది.
* చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైంది. బతుకమ్మ చీరల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి ఉపాధి కల్పించాం.
* దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు అందిస్తున్నాం.
* విద్యా ప్రమాణాలు పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది.
* ప్రజా వైద్యంపై విశ్వాసం పెరిగే విధంగా ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెంచాం.
* కంటి వెలుగు పథకం పేద ప్రజలకు వరంగా మారింది. దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్ధరణకు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేశాం. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్, రంజాన్‌లను రాష్ట్ర పండుగలుగా గుర్తించాం.
* ఆయా కులాల ఆత్మ గౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మిస్తాం. కల్యాణ లక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు.
* మిషన్ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. పెండింగ్ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేస్తున్నాం. అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకానికి విత్తనాలు ఇచ్చాం.
*మహబూబ్‌నగర్ జిల్లాలో 10లక్షల ఎకరాలకు నీరు అందించగలిగాం. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకున్నాం. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలవబోతోంది.
* సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధప్రతిపాదికన జరుగుతోంది.
* రైతు బీమా కింద రైతు మరణిస్తే రూ.5లక్షలు అందిస్తున్నాం. రైతు బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తోంది.
* జీవనం దుర్భరమైతే సంపద, పరిజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. సస్యశ్యామ సమశీతల తెలంగాణను ఆవిష్కరించుకోవాలి.
* స్థానిక సంస్థల పనితీరు మెరుగుకు పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం. స్థానిక సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు వస్తాయి. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు.
* పాలనలో జవాబుదారీతనం కోసం పురపాలక చట్టాన్ని తెస్తున్నాం. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతిని పారద్రోలితే.. పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.