తెలంగాణలో కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన వారు కరోనా లక్షణాలు ఉన్నా, లేకున్నా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిసిన వారు తప్పకుండా ఐసొలేషన్ తీసుకోవాలంది. కరోనా లక్షణాలుంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి ఒక్కరు తుమ్మినా, దగ్గినా, చేతిరుమాలు లేదా టిష్యూ పేపర్లను తప్పకుండా వినియోగించాలని, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.
స్వీయ నిర్భందంలో ఉండేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆహారం, నీరు అందించేవారు కూడా పూర్తి ఆరోగ్యవంతులు ఉండేలా జాగ్రత్తపడాలని చెప్పింది. ఇంట్లోని మిగతా వారు ఇతర గదుల్లో ఉండాలని.. అలా కుదరని పక్షంలో కనీసం ఒకరికి ఒకరు ఒక మీటరు దూరం ఉండేలా జాగ్రత్తపడాలని చెప్పింది ప్రభుత్వం. ఐసోలేషన్ లో ఉన్నవారికి కావాల్సినవి అందించేవారు తప్పక మాస్కులను ధరించాలని ప్రభుత్వం సూచనలు చేసింది.
కరోనాకు ఎలాంటి మందులు లేవని ఒకరికి ఒకరు దూరంగా ఉండటం, చేతులను తరచు శుభ్రం చేసుకోవటం, జనసమూహంలోకి వీలైనంత తక్కువగా వెళ్లటం ద్వారా కరోనా బారిన పడకుండా కాపాడుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఇంట్లో వాడుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించింది. వీలైతే డిస్పోజబుల్
పేపర్ టవల్స్‌ని లేదా ఒక్కొక్కరు ఒక్కో టవల్‌ను వాడాలని సూచించింది. టవల్ తడిగా మారితే వెంటనే కొత్తవాటిని వాడాలని హైపో క్లోరైడ్ సొల్యూషన్‌తో రోజుకు ఒక్కసారైనా ఇంట్లోని టాయిలెట్, బెడ్ ఫ్రేమ్స్, టేబుల్స్‌ని శుభ్రం చేయాలని సూచనలు చేసింది.