HomeTelugu Big Storiesతెలంగాణ కొత్త మంత్రులు.. వారి ప్రొఫైల్

తెలంగాణ కొత్త మంత్రులు.. వారి ప్రొఫైల్

12 9ఇవాళ ఉదయం 11.30కు తెలంగాణలో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. రాజ్‌భవన్‌లో పది మంది మంత్రులతో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులుగా ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అంటే..నలుగురు పాతవారికి మరోసారి కేబినెట్‌లో చోటు దక్కింది. ఆరుగురు కొత్త వారికి కేబినెట్‌లో స్థానం లభించింది. ఇక.. ఈ మంత్రులు వివరాలను పరిశీలిస్తే..

ఈటల రాజేందర్: డబుల్‌ హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన ఈటల రాజేందర్‌.. 2002లో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తొలిసారి 2004లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా, టీఆర్‌ఎస్‌ లెజిస్లెషన్‌ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో హుజురాబాద్ నుంచి విజయం సాధించారు. అనంతరం 2010లో రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో కూడా గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. కేసీఆర్‌ కేబినెట్‌లో కీలకమైన ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మరోసారి విజయం సాధించి.. మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

జగదీశ్‌రెడ్డి: టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న జగదీశ్‌రెడ్డి.. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్‌ బ్యూరో సభ్యునిగా పని చేశారు. 2001లో టీఆర్‌ఎస్‌ సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో సిద్దిపేట, 2003లో మెదక్, 2004లో మెదక్, సిద్దిపేట ఉప ఎన్నికల సమయంలో పార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 2006లో కరీంనగర్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నిక, 2008లో ముషీరాబాద్, ఆలేరు స్థానాల ఉప ఎన్నికలకు ఇన్‌చార్జిగా ఉన్నారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ పార్టీ తరఫున హుజూర్‌నగర్‌ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి చవిచూశారు ఆ తర్వాత 2011లో బాన్సువాడ, 2012లో కొల్లాపూర్‌ ఉప ఎన్నికలకు పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సూర్యాపేట నుంచి విజయం సాధించడంతో తెలంగాణ తొలి మంత్రివర్గంలో ఛాన్స్‌ దక్కించుకున్నారు. తొలుత విద్యాశాఖ మంత్రిగా.. ఆ తర్వాత విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో మళ్లీ గెలుపొందిన ఆయన.. మరోసారి కేబినెట్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నారు.

12a 2తలసాని శ్రీనివాస్ యాదవ్: హైదరాబాద్‌లో కీలకమైన తలసాని శ్రీనివాస్ యాదవ్.. సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు, సనత్ నగర్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1994లో సికింద్రాబాద్‌నుంచి గెలిచిన తలసాని.. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్‌లలో పనిచేశారు. 1999లో రెండోసారి ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో తిరిగి విజయం సాధించిన తలసాని.. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి కేబినెట్‌లో ఛాన్స్‌ దక్కించుకున్నారు.

కొప్పుల ఈశ్వర్:18 ఏళ్ల వయస్సులో సింగరేణి ఉద్యోగం పొంది, 26 ఏళ్లపాటు సింగరేణిలో పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌.. 1979లో రాజకీయ అరంగేట్రం చేసి సీపీఐ(ఎంఎల్)లో పనిచేశారు.1982 తర్వాత టీడీపీలో చేరారు. 1994 ఎన్నికల్లో మేడారం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2008లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈశ్వర్.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుమారస్వామిపై విజయం సాధించారు. 2009లో ధర్మపురి ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడగా.. అక్కడి నుంచి గెలుపొందారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ధర్మపురి నుంచి వరుస విజయాలు సాధించారు. తొలిసారి ఇప్పుడు మంత్రి పదవి దక్కించుకున్నారు.

వేముల ప్రశాంత్‌రెడ్డి: 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన వేముల సురేందర్ రెడ్డికి చేదోడు వాదోడుగా ప్రశాంత్‌రెడ్డి ఉండేవారు. తండ్రితో కలిసి బాల్కొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 2010లో నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. 2014లో అందరి కంటే ముందుగానే బాల్కొండ నుంచి టికెట్‌ పొంది అత్యధిక మెజారిటీతో గెలిచారు. స్వతహాగా ఇంజనీర్ అయిన ప్రశాంత్ రెడ్డి పనితీరు మెచ్చిన కేసీఆర్‌.. 2016లో మిషన్‌ భగీరథకు వైస్ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. కేబినెట్ హోదా కల్పించారు. 2018లోనూ బాల్కొండ నియోజకవర్గం నుంచి గెలుపొంది.. మంత్రి ఛాన్స్‌ కొట్టేశారు.

అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ న్యాయస్థానంలో న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేశారు. 1985లో టీడీపీలో చేరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక.. 1987లో జిల్లా పరిషత్ చైర్మన్‌కు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 1991లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున ఎన్నికైన ఆయన.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావుకు అండగా నిలిచేందుకు 1992లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 1999, 2001, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బరిలోకి దిగి.. నిర్మల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత బీఎస్పీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున మరోసారి బరిలోకి దిగి.. మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

12bసింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి: వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నిరంజన్‌రెడ్డి శాసనసభలో కాలుపెట్టడం ఇది మొదటిసారి. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న నిరంజన్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా కేబినెట్‌ ర్యాంకు ఉన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి పదవి లభించింది. 2018 ఎన్నికలకు ముందు ఆ పదవికి రాజీనామా చేసి.. ప్రచారంపై దృష్టి పెట్టారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. ఏ విషయమైనా విశ్లేషణాత్మకంగా వివరించే నేర్పు ఉన్న నిరంజన్‌రెడ్డికి అన్ని శాఖలపై మంచి పట్టు ఉంది. పాలనారంగంపై అవగాహన, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా అనుభవం ఉండటంతో ఈసారి ఆయనను మంత్రి పదవి వరించింది.

ఎర్రబెల్లి దయాకర్‌రావు:1983లో టీడీపీ తరఫున వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిచెందారు. 1987లో కల్లెడ సొసైటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవమై డీసీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 1994లో వర్ధన్నపేట నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 1997లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో వర్ధన్నపేట నుంచి రెండోసారి గెలుపొందారు. 1999లో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. 2004లో వర్ధన్నపేటలో మూడోసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2007 మార్చి 26న అసెంబ్లీ సమావేశాల్లో బాబ్లీ సహా 11 అక్రమ ప్రాజెక్టులను మహారాష్ట్ర నిర్మిస్తోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2008 జూన్‌లో వరంగల్‌ పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో పాలకుర్తి నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 2014లోనూ టీడీపీ తరఫున గెలుపొంది.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 40వేలకుపైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటివరకు ఆరుసార్లు శాసన సభకు, ఒకసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

చామకూర మల్లారెడ్డి: విద్యాసంస్థల అధినేతగా గుర్తింపు పొందిన చామకూర మల్లారెడ్డి 2014లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో మేడ్చల్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ఘన విజయం సాధించారు. ఏకంగా మంత్రి పదవిని దక్కించుకున్నారు.

వి.శ్రీనివాస్‌గౌడ్‌: ఉద్యోగసంఘ నేత నుంచి మంత్రిగా ఎదిగారు శ్రీనివాస్‌గౌడ్‌. ఉద్యమ సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన.. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. 2014లోనే శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జరిగినా.. అప్పటి రాజకీయ సమీకరణాల కారణంగా ఆయనకు అవకాశం దక్కలేదు. 2018లో తెలంగాణ రెండో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ క్రమంలో కేసీఆర్‌ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu