ప్రస్తుతం సినిమా టికెట్ ధరల విషయమై టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు తెలంగాణలోని అన్ని థియేటర్‌లలో సినిమా టికెట్ ధరలు పెరగనున్నాయి. టికెట్లపై ధర, జీఎస్‌టీ, నిర్వహణ ఛార్జీలు, ఆన్‌లైన్ ఛార్జీలను వేర్వేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పట్ల తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం ఇవీ ఛార్జీలు.. ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150+ జీఎస్‌టీ. మల్టీప్లెక్స్‌ల్లో మినిమం టికెట్ ధర రూ.100+జీఎస్‌టీ, గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీ. సింగిల్ థియేటర్లలో స్పెషల్ రిక్లైనర్ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ. నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.