శంషాబాద్ విమానాశ్రయంపై అధికారులు డేగ కన్ను పెట్టారు. ఎందుకంటే విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ద్వారా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో అధికారులను ప్రభుత్వం మరింత అప్రమత్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే విదేశాల నుంచి వచ్చిన 1500 మంది ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలించారు. అంతర్జాతీయ ప్రయాణికులపై గట్టి నిఘా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణికులను నేరుగా ఐసొలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వీరికోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. విదేశీయుల రాకపోకలను గమనించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.