తెలంగాణలో సినిమా థియేటర్లు 100 శాతం సీటింగ్ కొనసాగించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పుడు హౌస్ఫుల్ చేసేందుకు అవకాశమిచ్చింది. కరోనా, లాక్‌డౌన్‌తో వెలవెలబోయిన థియేటర్లు ఇప్పుడు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కొనసాగవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీటింగ్ కెపాసిటీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ అనంతరం అక్టోబర్‌లో యాభై శాతం ప్రేక్షకులతో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం 100 శాతానికి అనుమతి ఇవ్వడంతో థియేటర్ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యాభై శాతం ఆక్యుపెన్సీతో తాము తీవ్ర నష్టాల పాలయ్యామని గతంలో థియేటర్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు హౌస్‌ఫుల్‌కు అనుమతి ఇవ్వడంతో థియేటర్లకు పూర్వ వైభవం రానుంది. భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్‌లు, షో టైమింగ్స్, బుకింగ్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.