తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న కేసీఆర్ హామీని నిలబెట్టుకోవాలంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. సమ్మెను ప్రభుత్వం మీద, ప్రయాణికులపైనా బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు.
విధానపరంగా ఆర్టీసీ ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీ ఆస్తుల విలువ రూ. 4,416 కోట్లు అని.. మూడేళ్ల కిందట 25 శాతం ఫిట్‌మెంట్ ఇస్తారని అనుకున్నప్పటికీ కార్మికులకు 45 శాతం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సమ్మె విషయంలో అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు.
సమ్మె పరిష్కారానికి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశామని, దానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.