దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ విధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే కోవలో లాక్‌డౌన్ విధిస్తూ మార్గదర్శకాలు జారీచేసింది. మే 12 నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి ఉ.10 గంటల వరకు సడలింపు ఇచ్చింది. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20న మరోసారి కేబినెట్ జరగనుంది. అప్పటి పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ కొనసాగింపుపై మరోసారి చర్చించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.
సినిమా హాళ్లు, క్లబ్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, స్టేడియంలు మూసివేయనున్నారు. ఆర్టీసీ బస్సులు ఉ.6 గంటల నుంచి 10 వరకు మాత్రమే నడపాలని ఆదేశాలు. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేయనున్నాయి. వ్యవసాయం, విద్యుత్, మీడియా రంగాల వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకావొద్దని ఆదేశాలు. వివాహాలకు 40 మందికి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.