తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మానవ అక్రమరవాణా, పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మానవ అక్రమ రవాణా చేశాడంటూ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పక్కా సమాచారం మేరకు సుమోటోగా కేసు నమోదు చేసిన మార్కెట్ స్టేషన్ పోలీసులు ఆయనపై నిన్న ఉదయం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న జగ్గారెడ్డిని ముత్తంగి వద్ద అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి నేరుగా బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ పలు గుర్తింపు కార్డులు, ఫొటోలు స్వాధీనం చేసుకున్న అనంతరం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఈరోజు ఉదయం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉత్తర మండల డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. అరెస్టుకు సంబంధించి డీసీపీ సుమతి వివరాలు వెల్లడించారు.
“2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నకిలీ డాక్యుమెంట్స్‌తో ఇతరులను తన కుటుంబ సభ్యులుగా చూపించి పాస్‌పోర్టులు పొందారని డీసీపీ వెల్లడించారు. వాళ్లు తన కుటుంబం అని, పాస్‌పోర్టులు ఇవ్వాలని 2004 సెప్టెంబరులో ఎమ్మెల్యే హోదాలో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులకు జగ్గారెడ్డి లేఖ రాశారు. దీనికోసం తన భార్య, ఇద్దరు పిల్లల స్థానంలో వేరే వాళ్లను చూపించారు. తన కుటుంబ సభ్యుల పేరుమీద మంజూరు చేసిన పాస్‌పోర్టులు ఉపయోగించి చెన్నైలోని యూఎస్‌ఏ కాన్సులేట్ నుంచి వీసాలు పొందారు. మొత్తం ఐదు వీసాలు పొందిన జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) అదే ఏడాది.. ముగ్గురితో పాటు అతని స్నేహితుడు జెట్టి కుసుమ కుమార్‌తో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ ఐదురోజులు పాటు ఉండి.. అనంతరం జయప్రకాశ్‌రెడ్డి, అతని స్నేహితుడు జెట్టి కుసుమ కుమార్ మాత్రమే హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఏజెంట్ మధు ద్వారా అమెరికా తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదిరిందని, ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.15లక్షలు జగ్గారెడ్డి తీసుకున్నట్లు తమ విచారణలో వెల్లడైనట్లు డీసీపీ వివరించారు.
పాస్‌పోర్టు సందర్భంగా జగ్గారెడ్డి చూపించిన పత్రాలు, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన పోలీసులు.. రెండింటికి ఎక్కడా పొంతన లేదని తెలిపారు. ఈమేరకు ఆధారాల కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫొటోలు సేకరించారు. తన పాస్‌పోర్టు పోయిందంటూ 2016 జనవరిలో మరో కొత్త పాస్‌పోర్టును జగ్గారెడ్డి పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ జగ్గారెడ్డి అధికార పార్టీని విమర్శించారు.
జగ్గారెడ్డి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ న్యాయస్థానం స్వీకరించలేదు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. కేసులో పురోగతి కోసం జగ్గారెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.