దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్‌డౌన్ ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు తెలిపారు. ఎప్పటిలాగే వచ్చేనెలలో రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని, అయితే రూ.1500 చొప్పున ఇచ్చే కార్యక్రమం నిలిపేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి ఈ నెలలో రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం 3 వేల కోట్లు మాత్రమే వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పింఛన్లలో 25 శాతం కోతలను కొనసాగించాలని కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నందున మరికొన్ని రోజులు సిటీ బస్సులకు అనుమతి లేదన్నారు.