తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే నమోదైన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏకంగా 154 మందికి కోవిడ్-19 సోకింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో 12 హాట్ స్పాట్స్ గుర్తించి కాంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించింది. ఆయా ప్రాంతాల నుంచి ప్రజలకు బయటకు వెళ్లకుండా, ఇతరులు లోపలికి రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం విజయ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. అనంతరం మీడియాలో మాట్లాడిన సీఎస్, డీజీపీ.. హైదరాబాద్‌లో 12 కరోనా నియంత్రణ ప్రాంతాలున్నాయని.. ఈ ప్రదేశాల్లోకి బయటి వ్యక్తులు రాకూడదని, అలాగే అక్కడి ప్రజలు బయటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు. కరోనా కట్టడి కోసమే ఇదంతా చేస్తున్నామని దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లోని రాంగోపాల్ పేట్, షేక్ పేట్, రెడ్ హిల్స్, మలక్ పేట్ సంతోష్ నగర్, కూకట్ పల్లి, యూసుఫ్ గూడ, చందానగర్, మూసాపేట్, కుత్బుల్లాపూర్ గాజులరామారం, అల్వాల్, మయూరినగర్, చాంద్రాయణగుట్ట వంటి 12 ప్రాంతాలను కరోనా హాట్ స్పాట్స్‌గా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం… వీటిని కంటైన్‌మెంట్ క్లస్టర్స్‌గా ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో 154 కేసులు నమోదైతే.. అందులో ఈ ప్రాంతాల్లోనే 89 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలతో పాటు బ్యారికేడ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 453 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 45 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 మంది చనిపోగా.. ప్రస్తుతం 397 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.