దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రధాని మోడీకి ఇదే విషయం తెలిపినట్లు కేసీఆర్ అన్నారు. కరోనాను అరికట్టడానికి మనదగ్గర ఉన్న ఆయుధం ఒక్క లాక్‌డౌన్ తప్ప మరో గత్యంతరం లేదని కేసీఆర్ అన్నారు. ఆర్థికంగా నష్టపోతే మళ్లీ రికవరీ చేసుకోవచ్చని, మనుషుల ప్రాణాలు పోతే రికవరీ చేయలేము కదా అని కేసీఆర్ అన్నారు. బతికుంటే బలుసాకు తినొచ్చని అన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని అన్నారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 364కి చేరుకుందని కేసీఆర్ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 308 మంది చికిత్స పొందుతున్నారని వారిలో ఎవరి పరిస్థితి విషమంగా లేదని అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వారి ద్వారా 93 మంది కుటుంబ సభ్యులకు ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు. తెలంగాణలో మరో 600 మందికి పరీక్షలు నిర్ధారణ కావాల్సి ఉందని వీరిలో 100 మందికి పాజిటివ్ వచ్చే అవకాశముందని తెలిపారు.
లాక్‌డౌన్‌కు తెలంగాణ ప్రజలు చాలా సహకరించారని, ఇంకా సహకరించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. 22 దేశాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాయని, మరో 90 దేశాలు పాక్షికంగా లాక్‌డౌన్ చేశాయని పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు. దీనిని ఎవరూ శిక్షగాను, బలవంతంగాను భావించొద్దని అన్నారు. రాష్ట్రంతో పాటు దేశం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకోవడం మంచి విషయమని అన్నారు. సమాజాన్ని బతికించుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గమని కేసీఆర్ తెలిపారు.