HomeTelugu Newsటీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం..!

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం..!

14 2
తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ పార్టీలో టీ-కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు గురువారం రాత్రి శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి. నరసింహా చార్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీకి చెందిన 12 మంది సభ్యుల అభ్యర్థన మేరకు విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్టు ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగం 10వ షెడ్యూల్‌ సబ్‌-పేరా(2)లోని నిబంధనలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల కోరిక మేరకు విలీనం చేసినట్టు వివరించారు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇక నుంచి శాసనసభలో టీఆర్‌ఎస్‌ సభ్యులతో కలిసి కూర్చుంటారని తెలిపారు. 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రుల చేరికతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ బలం 102కు చేరింది. కాగా, విలీనంపై న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపింది. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో కలిసిపోవడంతో శాసనసభలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu