తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉధృతమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ సమ్మె చేపట్టిన కార్మికులు రేపటినుంచి మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 13న తెలంగాణ వ్యాప్తంగా వంటావార్పు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 14న అన్ని డిపోల ముందు బైఠాయించాలని, బహిరంగ సభలు నిర్వహించాలని.. 15న రాస్తారోకోలు, మానవహారాలు, 16న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థులు ర్యాలీలు నిర్వహించాలని, 17న ధూంధాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు.