తెలంగాణలో ముందస్తుకు మహూర్తం డిసైడ్ అయింది. మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు కాబోతుంది. ముందస్తు కోసం ప్రభుత్వాన్ని రద్దు చేయడం కోసం సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఇవాళ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ముందుగా గురువారం మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన
కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సంబంధించి తీర్మానం చేసే అవకాశముందని ప్రచారం జరిగింది.
అయితే తేదీ అదే గానీ సమయం మారింది. మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీని రద్దు చేసే అంశంపై చర్చించనుంది. దీనిపై మంత్రివర్గం కూడా తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. తీర్మానానికి సంబంధించిన లేఖను గవర్నర్‌కు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మంత్రులతో సహా రాజ్‌భవన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం
జరిగే కేబినెట్ సమావేశం చాలా కొద్ది సమయంలోనే ముగించే అవకాశముంది. అసెంబ్లీ రద్దు తీర్మానం ఆమోదించిన వెంటనే గవర్నర్‌ను కేసీఆర్ కలిసే అవకాశముంది. మంత్రిమండలి సిఫార్సులను గవర్నర్ నరసింహన్‌కు అందజేయనున్నారు. దీంతో బంతి గవర్నర్ కోర్టుకు చేరుతుంది. గవర్నర్‌కు సిఫార్సు లేఖలను అందజేసిన తర్వాత
మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్టు ప్రకటించే అవకాశముంది.
అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. సెప్టెంబర్ 2న జరిగిన టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే ఇవాళే ఆ ముహూర్తం ఖరారైనట్లు అంతా భావిస్తున్నారు. తిథి, వారం, నక్షత్ర బలం చూసుకుని అత్యంత అనుకూలంగా భావించే గురుపుష్య యోగంలో అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినా కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరనున్నారు. మంత్రివర్గం కూడా ఆపద్ధర్మ మంత్రివర్గం కొనసాగుతుంది. విశేష అధికారాలు లేనప్పటికీ వాళ్ల శాఖలకు సంబంధించిన రొటీన్ వ్యవహారాలు సమీక్షలు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకం లేకుండా జరగనున్నాయి. కీలక అంశాలకు సంబంధించి ఆపద్ధర్మ ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోలేరు.
రేపటి హుస్నాబాద్ సభతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రాబోయే 100 రోజుల్లో 50 బహిరంగ సభలు నిర్వహించాలని ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేశారు.