HomeTelugu Big Storiesఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

11a

టీమిండియాకు ఇది ఘన చరితే. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకుని అరుదైన రికార్డును సాధించింది. ఆస్ట్రేలియాపై పరిపూర్ణ విజయం. 72 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. దిగ్గజ కెప్టెన్లకు సైతం సాధ్యం కాని విజయాన్ని విరాట్ కోహ్లీ అలవోకగా సాధించాడు. చరిత్ర పుటల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు. ఓ పటిష్ఠ జట్టుపై విదేశాల్లో టీమిండియా అన్ని సిరీస్‌లను కోహ్లీ నాయకత్వంలోనే అందుకోవడం అద్భుతం.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని ఆస్ట్రేలియా గడ్డపై ఏడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా మారిన సిరీస్ విజయాన్ని కోహ్లీ అందించాడు. అంతకుముందు జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుని రికార్డులకెక్కింది.

ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు ఇదే తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. సిరీస్ ఓటమి లేకుండా ఆసీస్ టూర్‌ను భారత్ ఘనంగా ముగించింది. 2016లో ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత్ 1-4తో ఓటమి పాలైంది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు కోహ్లీ ప్రతీకారం తీర్చుకున్నాడు. కాగా, 1947-48లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 0-4తో ఘోర ఓటమి చవి చూసింది. నాటి నుంచి ఆసీస్ గడ్డపై అందని ద్రాక్షలా మారిన సిరీస్ విజయాన్ని భారత్‌కు అందించిన కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.

భారత వికెట్ కీపర్‌, “మిస్టర్ కూల్” మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ వన్డే సిరీస్‌లో ధోని అద్భుత ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూత బడ్డాయి. 2018లో అతడి వైఫల్యం మీదే చర్చ నడిచింది. 2019 మాత్రం అతడి దశను మార్చింది. ఆస్ట్రేలియాలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరసగా మూడు అర్ధశతకాలతో ఆకట్టుకొని టీమిండియా విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు. మందకొడిగా ఉన్న పిచ్‌పై పరుగులు రాక ఒకవైపు, ఓపెనర్లు, కెప్టెన్‌ కోహ్లీ ఔటవ్వడంతో మరోవైపు టీమిండియా మీద ఒత్తిడి పెరిగింది. అప్పుడే మిస్టర్ కూల్‌, బెస్ట్ ఫినిషర్‌ ట్యాగ్‌లను నిలబెట్టుకుంటూ జట్టును విజయ బాట పట్టించాడు మహీ. ఛేదనలో అతడు 114 బంతుల్లో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలతో ఆకట్టుకున్న ధోనీకి మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ దక్కింది. అదీ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత కావడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu