AP Politics: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న పలువురు నేతలు టీడీపీలోకి భారీగా చేరుతున్నారు. టీడీపీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్తోంది.
టీడీపీ ప్రణాళికలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉండవల్లిలోని నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆశావాహులు, పార్టీలో చేరికలకు వచ్చిన వారితో చంద్రబాబు నివాస ప్రాంతం కోలాహలంగా మారింది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గురువారం చంద్రబాబును కలిశారు. ఇటీవలే ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. త్వరలోనే టీడీపీలో శ్రీకృష్ణదేవరాయులు చేరుతున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా వైసీపీ అధిష్ఠానంపై ఎంపీ అసంతృప్తితో ఉన్నారు.
కొద్దిరోజుల క్రితం తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఆ సమయంలో ఎంపీపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీ హై కమాండ్‌తో శ్రీకృష్ణదేవరాయలు అంటీ అంటనట్లుగా ఉంటున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అతను టీడీపీలోకి చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబును కలిసినట్లు సమాచారం. టీడీపీలో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
మరోవైపు నరసరావుపేట నుంచి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి వచ్చారు. ఆయన అనుచరులతో కలిసి 100 కార్ల భారీ కాన్వాయ్‌తో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరనున్నారు.
అంతే కాకుండా చంద్రబాబును ఇవాళ పలువురు టీడీపీ సీనియర్ నాయకులు కూడా కలిశారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఇన్‌చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావును పిలిచి చంద్రబాబు మాట్లాడారు చింతలపూడి నియోజకవర్గాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలంటూ నరసరావుపేటకు చెందిన టీడీపీ రజక నాయకులు చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్లలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా నేతలు చేరుతున్నారు.