HomeTelugu Big StoriesAP Elections 2024: టీడీపీని కలవరపెడుతున్న ఆ నియోజకవర్గాలు

AP Elections 2024: టీడీపీని కలవరపెడుతున్న ఆ నియోజకవర్గాలు

AP Elections 2024

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ వేటికవే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు తమదంటే తమదేనని వాదిస్తున్నాయి. అందుకే గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ఈసారి టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచింది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేసి విజయాన్ని సాధించాయి. అయితే మరోసారి ఈ కూటమి విజయం సాధిస్తుందా?

2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్‌ కాంగ్రెస్(YSRCP) రెండోసారి అధికారంలోకి రావాలని తపిస్తోంది. వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన TDP టీడీపీ 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా సొంతంగా, జట్టుగా 88 స్థానాలను దక్కించుకున్న వారికే విజయం దక్కుతుంది. 2014లో 102 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. BJP బీజేపీ అభ్యర్థులు మరో నాలుగు చోట్ల గెలుపొందారు.

2019 ఎన్నికల్లో ఓటమిపాలైన టీడీపీ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ప్రయత్నాలు చేస్తోంది. అందుకే జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఎన్డీఏ కూటమి తరపున అధికార వైసీపీతో తలపడుతోంది. అయితే గతంలో హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసుకున్న నియోజక వర్గాలు టీడీపీని కలవర పెడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గత పదిహేనేళ్లలో టీడీపీ వరుసగా హ్యాట్రిక్ పరాజయాలు చవి చూసిన నియోజక వర్గాలు సుమారు 48 వరకు ఉన్నాయి. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఈ నియోజక వర్గాల్లో టీడీపీయేతర అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారైనా ఆ నియోజక వర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది.

గత మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజక వర్గాలు టీడీపీని కలవర పెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిదో తెలియడానికి మరో 48 రోజులు ఎదురు చూడాల్సిందే. గురువారం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

జిల్లాల వారీగా టీడీపీ హ్యాట్రిక్ ఓటమి పాలైన నియోజకవర్గాలు :
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 2004 తర్వాత టీడీపీ అభ్యర్ధులు గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలోని రిజర్వుడు నియోజక వర్గాలైన రాజాం(ఎస్సీ), పాలకొండ(ఎస్టీ) నియోజకవర్గాల్లో కూడా 2004 తర్వాత టీడీపీ గెలవలేదు. అక్కడ వరుసగా మూడుసార్లు ఓటమి పాలైంది. కాంగ్రెస్ తర్వాత వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు.

విజయనగరం జిల్లాలో కురుపాం(ఎస్టీ), సాలూరు (ఎస్టీ) నియోజక వర్గాల్లో గత మూడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. బొబ్బిలిలో అయితే 1994 తర్వాత ఆ పార్టీ విజయం సాధించలేదు. వరుసగా ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

విశాఖపట్నంలోని పాడేరులో1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. 2004లో బిఎస్పీ, 2009లో కాంగ్రెస్‌, 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు పాడేరులో గెలిచారు.

తూర్పు గోదావరి జిల్లా తునిలో 2009, 2014, 2019లో టీడీపీయేతర అభ్యర్థులు గెలిచారు. ప్రత్తిపాడులో చివరిసారి 1999లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. పిఠాపురంలో 2004లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. 2009లో పీఆర్పీ, 2014లో ఇండిపెండెంట్, 2019లో వైసీపీలు గెలిచాయి.

కోనసీమలోని కొత్తపేట, జగ్గంపేటలో కూడా 1999 తర్వాత టీడీపీ అభ్యర్థి గెలవలేదు. రంపచోడవరంలో గత మూడు ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 2014లో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి గెలిచారు.

కృష్ణా జిల్లాలోని పామర్రు (ఎస్సీ), విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటమి తప్పలేదు. 1983 తర్వాత విజయవాడ పశ్చిమలో ఒక్కసారి కూడా టీడీపీ అభ్యర్థి గెలుపొందలేదు.

గుంటూరులో మంగళగిరిలో 1989నుంచి టీడీపీ విజయం నమోదు చేయలేదు. గత ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసినా ఓటమి తప్పలేదు. బాపట్లలో 2004 నుంచి టీడీపీ ఓటమి పాలవుతోంది. గుంటూరు ఈస్ట్‌, నరసరావుపేట, మాచర్లలో కూడా నాలుగు సార్లు ఓటమి పాలైంది.

ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం(ఎస్సీ), సంతమాగులూరు (ఎస్సీ), కందుకూరు, గిద్దలూరు నియోజకవర్గాల్లో వరుస ఓటములు తప్పలేదు. నెల్లూరులో ఆత్మకూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లిలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

కడప జిల్లాలోని బద్వేల్, కడప, కోడూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం, మైదుకూరులో 2009 తర్వాత టీడీపీ అభ్యర్థులు విజయం సాధించలేదు.

కర్నూలు జిల్లాలో శ్రీశైలం, నందికొట్కూరు (ఎస్సీ), కర్నూలు, పాణ్యం, కోడుమూరు, ఆలూరులో వరుస పరాజయాలను ఎదుర్కొంది టీడీపీ. చిత్తూరులో పీలేరు, మదనపల్లె, పుంగనూరు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పూతల పట్టులో టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి జిల్లాల్లో కేవలం అనంతపురంలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓటమి పాలయ్యారు.

టీడీపీకి ఇలా పలుచోట్ల వరుస పరాజయాలు ఉన్నా టీడీపీ వర్గాలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ ఒక్కో జిల్లాలో పార్టీ బలాబలాలు ఒక్కోలా ఉంటాయని చెబుతున్నారు. వరుస ఓటములు నమోదైన నియోజకవర్గాల్లో ఓటమికి పలు రకాల కారణాలు ఉంటాయని, అయితే ఈసారి ఆనియోజకవర్గాల్లోనూ గెలుస్తామనే ధీమాతో ఉన్నామని చెప్తున్నారు. 2014లో 102 స్థానాల్లో గెలిచామని ఈసారి కూడా సెంచరీ కొడతామని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu