డేటా చోరీ వ్యవహారం మరింత ముదిరి పాకానపడుతోంది. ఈ వ్యవహారంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్‌పై టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అమరావతిలో పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ టీడీపీ డేటా దొంగతనానికి గురైందని అన్నారు. అమరావతిలోనే ఈ కుట్రకు తెర లేపారని ఆరోపించారు. గత నెల 23వ తేదీనే తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్ధలోకి వెళ్లి సోదాలు చేశారని అశోక్ సహా పలువురు కీలక ఉద్యోగులను ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో విచారించారని ఆరోపించారు.
మఫ్టీలో తెలంగాణ పోలీసులు చేసిన విచారణ దొంగతనం కిందే లెక్క అని తెలిపారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యోగులను బెదిరించి సమాచారం సేకరించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. టీడీపీ డేటా దొంగతనం సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..?, సైబరాబాద్ సీపీ కుట్రలో భాగస్వామా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సైబరాబాద్ కమిషనర్ కనుసన్నల్లోనే అధికార దుర్వినియోగం జరిగిందని పయ్యావుల ఆరోపించారు. రెండో తేదీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మూడో తేదీ నాటికి అశోక్ పరారయ్యారని ఎలా ప్రకటిస్తారాని మండిపడ్డారు. గత నెల 23వ తేదీనే ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు చేశామని చెప్పగలిగే దమ్ము సైబరాబాద్ కమిషనర్‌కు ఉందా..? అంటూ సవాల్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ… తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తకుండా సజ్జనార్ ఐపీఎస్ అధికారిగా వ్యవహరించాలని సూచించారు.