ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వాసుపల్లి గణేశ్‌కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నదీ జలాల పంపకంపై సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు సభకు ఆటంకం కలిగించారు. దీంతో స్పీకర్ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన నలుగురు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. వారంతా సభ నుంచి వెళ్లాలని స్పీకర్ సూచించినప్పటికీ ఫలితం లేకపోవడంతో మార్షల్స్ సాయంతో వారిని బయటకు పంపించారు. ఈ రోజు సభ ముగిసేవరకు స్పీకర్ ఈ నలుగురినీ సస్పెండ్ చేశారు.