అసెంబ్లీ సమావేశాల తొలిరోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించడం తెలుగుదేశం ప్రజాప్రతినిధులు మరిచిపోయారు. ఉభయసభల్లో దాదాపు 160 మంది ప్రాతినిథ్యం వహిస్తుండగా ఈరోజు అన్నగారికి వెంకటపాలెంలో సీఎం నివాళులు అర్పించేటప్పుడు కనీసం 15మంది కూడా లేరు. హైదరాబాద్‌లో సమావేశాలు జరిగినప్పుడు ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి నివాళులు అర్పించిన తర్వాతే సభకు వెళ్లడం ఆనవాయితీగా ఉండేది.
అసెంబ్లీ అమరావతికి మారిన తర్వాత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తొలిరోజు నివాళులు అర్పించి అసెంబ్లీకి వెళ్లడం సీఎం ఆనవాయితీగా పెట్టుకోవడంతో ప్రజాప్రతినిధులూ ఆయన్ని అనుసరిస్తున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీకి వెళ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో నేతల హాజరు తక్కువగా ఉంది. దీంతో నేతలు పదవులు పొందాక బాధ్యతలు విస్మరిస్తున్నాయనే గుసగుసలు గ్రామస్థుల నుంచి వినిపించాయి. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు లోకేశ్, దేవినేని, జవహర్, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు యామినీబాల, రాధాకృష్ణ, చాంద్‌బాషా, మాధవనాయుడు, శ్రవణ్‌కుమార్, గణబాబు, పీలా గోవింద్, మాధవవాయుడు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, గౌరుగాని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, టీడీ జనార్దన్ మాత్రమే సీఎం వెంట వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సభ్యులు గైర్హాజరవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ఇచ్చే గౌరవం ఇది కాదని అసహనం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్షాకాల శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశానికి ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. మరోవైపు భాజపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో గొడుగులతో
ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీ లీకులమయంగా ఉందని, చిన్నపాటి వర్షానికే నీళ్లు వచ్చి చేరుతున్నాయంటూ నిరసన తెలిపారు. అందుకే ముందు జాగ్రత్తగా గొడుగులు, రెయిన్‌కోట్లతో వచ్చామని ఎద్దేవాచేశారు. రూ.1000 కోట్ల ప్రజాధనం వృథా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.