రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తే.. ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో గేమ్ ఆడుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. ఇసుక లేక ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. ఇసుక కొరత మీద మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దీక్ష చేస్తుంటే ప్రభుత్వం వణికిపోతోందని, ఇసుక వ్యవహారం బయటకు రానివ్వకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
వైసిపి నేతల ఆధ్వర్యంలో టన్నుల కొద్దీ ఇసుక పక్క రాష్ట్రాల రాజధానులకు పోతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు రూ. 20 వేల కోట్లు నష్టం జరిగిందని దేవినేని ఉమా అన్నారు. మరోవైపు రూ.50 మద్యం బాటిల్‌ను రూ.100కు అమ్ముకుంటూ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
గత ప్రభుత్వ హామీలను ముందుకు తీసుకువెళ్ళ లేకపోవడంతో జగన్ ప్రభుత్వానికి రుణం ఇవ్వబోమని ఎస్‌బీఐ చెప్పినట్టు దేవినేని ఉమా అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకుండా… నాలుగు నెలలకే అసమర్ధంగా తయారయిందని విమర్శించారు. విజయసాయిరెడ్డి.. ట్వీట్ల సాయిరెడ్డిగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే గోదావరిలో నుంచి లాంచినీ బయటకు తీయలేకపోతున్నారని విమర్శించారు.