Chandra Babu Naidu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి తాను చేసిన పనుల గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కూడా వైసీపీ ప్రభుత్వం అరాచకాలపై పలు వేదికలపై దుమ్మెత్తిపోస్తోంది.
ఏపీ వ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాల్లో టీడీపీ ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ మరియు వైసీపీ నేతలు అడ్డగోలు దోపిడీ చేశారంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతగా నష్టపోయిందో చెప్తున్నారు.
వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి పోయిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాల్సి ఉందని చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కానీ బీజేపీ సంగతి ఏమిటన్నది ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. మరోవైపు బీజేపీ కూడా ఏపీలో ప్రచారం మొదలు పెట్టింది. తాము జనసేనతో కలిసే ఉన్నామని ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీ అధిష్టానందే ఫైనల్ అని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు అంశంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. టీడీపీతో కలిసి వెళ్లేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశాక దానిపై మరింత స్పష్టత రానుంది.