ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తూ అస్త్ర, శస్త్రాలను ఉపయోగించడం సహజమే. దీనిలో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మరో అస్త్రం ఎక్కుపెట్టింది టీడీపీ. ఎన్నికలు సమీపించిన వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్ లోని 11 ఎకరాలకు పైగా భూమి విషయానికి సంబంధించిన సంచలన విషయాన్ని టీడీపీ తాజాగా మరోసారి గుర్తు చేసింది. రాష్ట్రానికి అన్యాయం చేసినా జగన్ అధికార బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఏపీ సర్కార్, టీడీపీలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీకి చెందిన నేతలు ఇప్పుడు దానికి రుజువుగా 2017 మే 31న జగన్ ఆస్తుల వ్యవహారంలో అవినీతి చాలా భారీస్థాయిలో జరిగిందని..ఆ క్విడ్ ప్రో కో కేసుని లోతుగా దర్యాప్తు చేసి త్వరగా నివేదిక ఇస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పుడు ఈడీ చీఫ్‌గా ఉన్న కర్నల్ సింగ్ అప్పటి సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖను చూపిస్తున్నారు.
హిందూజా భూ వివాదంపై రెండేళ్ల క్రితం సీబీఐకి ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. హిందూజా గ్రూప్‌కి వైఎస్ సర్కారు 100 ఎకరాల భూమి కేటాయించినందుకు క్విడ్ ప్రోకో కింద జగన్‌కు 11 ఎకరాలు దక్కిందని దీనిపై విచారణ జరపాలని సీబీఐని కోరుతూ ఈడీ లేఖ రాసింది. మోడీతో జగన్ క్విడ్ ప్రో కో అయ్యారని, అందువల్లే దీనిపై రెండేళ్ల కిందటే ఈడీ సీబీఐకి లేఖ రాసినా బయటకు రాలేదని టీడీపీ ఆరోపించింది. హిందూజా భూదందాలో జగన్ పాత్రపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఎన్నికల ముందు ఈ లేఖ బయటకు రావడం వెనక కుట్ర ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఈ లేఖపై వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హిందూజా భూ దందా, మనీ ల్యాండరింగ్ గురించి ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ 2017 మే 31న సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు లేఖ రాశారు. హిందూజా గ్రూప్‌కి 100 ఎకరాలు కట్టబెట్టిన వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగిందని ఈడీ ఆ లేఖలో పేర్కొంది. హిందూజాకు భూముల కేటాయింపులో అక్రమాల గురించి రెండేళ్ల క్రితమే సీబీఐకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లేఖ రాసినా జగన్‌పై దర్యాప్తు జరగకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్, సాయిరెడ్డి ఇద్దరూ హిందూజా భూ అక్రమాల్లో కీలకనిందితులని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్న హిందూజా గ్రూపు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ సర్కారు రెసిడెన్షియల్ జోన్‌గా మార్చిందని టీడీపీ నేతలు గుర్తుచేశారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ (మ) పాలవలసలోని హిందూజా థర్మల్ విద్యుత్ ప్లాంట్ పునరుద్ధరణకు అనుమతి ఇచ్చారని, దీనికిప్రతిఫలంగా జగన్‌కు చెందిన కంపెనీకి 11.10 ఎకరాలు హిందూజా గ్రూప్ కట్టబెట్టిందని ఈడీ గుర్తించింది. అప్పట్లోనే జగన్‌కు ఇచ్చిన భూమి విలువ రూ. 177.60 కోట్లుగా తెలిపింది.