సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెల 2వ వారం నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో సినిమా కావడం మరో విశేషం. త్రివిక్రమ్ తన సినిమాలలోని ముఖ్యమైన పాత్రలలో సీనియర్ హీరోలను .. హీరోయిన్స్ ను తీసుకుంటూ ఉంటాడు. అలా ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం హీరో తరుణ్ ను తీసుకున్నట్టుగా సమాచారం.
బాలనటుడిగా .. హీరోగా టాలీవుడ్‌లో తరుణ్ మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అలాంటి తరుణ్ మళ్లీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. రచయితగా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్, తరుణ్ సినిమా ‘నువ్వే నువ్వే’తోనే దర్శకుడిగా పరిచయమయ్యాడు. అలాంటి త్రివిక్రమ్ సినిమాతోనే తరుణ్ రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది.