నటి తనుశ్రీ దత్తా తనకు ఏదైనా హాని జరిగితే అందుకు నానా పటేకర్ దే బాధ్యతగా పేర్కొన్నారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తనుశ్రీ దత్తా ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఇన్ స్టా గ్రామ్ లో ఆమె నానా పటేకర్ పై ఆరోపణలు చేశారు.
‘నాకు ఏదైనా జరిగితే నిందితుడు నానా పటేకర్, అతడి లాయర్లు, అసోసియేట్స్, అతడి బాలీవుడ్ మాఫియా స్నేహితులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాలీవుడ్ మాఫియా అంటే ఎవరు? సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (ఎస్ఎస్ఆర్) మృతి కేసులో తరచూ వినిపించే అవే పేర్లు. వారి సినిమాలు చూడకండి. బహిష్కరించండి. క్రూరమైన ప్రతీకారంతో వారిని వెంబడించండి.
నా గురించి నకిలీ వార్తలు సృష్టించిన, దుర్మార్గపు ప్రచారం చేసిన సినీ పరిశ్రమ వ్యక్తులు, జర్నలిస్టులను వెంటాడండి. చట్టం, న్యాయం నా విషయంలో విఫలమయ్యాయి. కానీ, ఈ మహోన్నతమైన దేశ ప్రజల పట్ల నాకు నమ్మకం ఉంది. జై హింద్.. బై మళ్లీ కలుద్దాం’ అని తనుశ్రీ దత్తా పోస్ట్ పెట్టింది. 2018లో తనుశ్రీ దత్తా ‘మీ టూ మూవ్ మెంట్’ ను ప్రారంభించడం గమనార్హం. సినిమా చిత్రీకరణ సందర్భంగా నానా పటేకర్ తోపాటు, కొరియోగ్రాఫర్ ఆచార్య, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు