కరోనా సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేస్తున్న మంచి పనులు చేస్తున్నాడు. తన సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు సోనూ సూద్. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోనూసూద్ ఒకప్పుడు కమర్షియల్ గా ఉండేవాడని తెలిపారు. ‘సోనూ సూద్ చాలా సిన్సియర్ గా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అతని గురించి మాట్లాడే అర్హత కూడా మనకు లేదు. ప్రభుత్వాల కంటే బాగా ఆయన పనులు చేస్తున్నాడు” అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. ఆయన.. ఓ సమయంలో సోనూసూద్ ఎంత కమర్షియల్ గా వ్యవహరించాడో చెప్పుకొచ్చాడు.
‘ఒకప్పుడు నేను ఓ ఫంక్షన్ కి రమ్మని సోనూసూద్ ని అడిగితే డబ్బులు అడిగాడు. అప్పుడు నేను అతన్ని మంచివాడు కాదు అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు ఆయన దేవుడిలా కనిపిస్తున్నాడు. నాలుగైదేళ్ల క్రితం వికలాంగుల ఛారిటీ కోసం ఓ ప్రోగ్రామ్ కి రమ్మని సోనూసూద్ ను అడుగగా.. ఆయన ఇంత డబ్బులు ఇస్తే వస్తానన్నాడు. ఇతను ఇంత కమర్షియల్ మనిషి అనుకున్నాను. కానీ ఇప్పుడు సోనూసూద్ తనకున్న ఆస్తుల కంటే ఎక్కవ ఖర్చు చేసి సేవ చేస్తున్నాడంటే ఇప్పుడు అతను దేవుడు’ అని చెబుతూ సోనూసూద్ ను తమ్మారెడ్డి భరద్వాజా మెచ్చుకున్నాడు.