నేడు తెలంగాణ కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో 1961 జూన్ 2న జన్మించారు. ఆమె తండ్రి అనంతన్ పార్లమెంటు మాజీ సభ్యుడే కాకుండా, తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత కూడా. తిమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు చెన్నైలోని రామచంద్ర మెడికల్ కాలేజీలో ఐదేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. పలు ఆసుపత్రులకు విజిటింగ్ కన్సల్టెంట్‌గా కూడా ఉండేవారు.
చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న తమిళిసై సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్టూడెంట్స్ లీడర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ కుటుంబం నుంచే వచ్చినప్పటికీ బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆమె ఆకర్షితురాలయ్యారు. బీజేపీకి పూర్తిస్థాయి కార్యకర్తగా పనిచేయడం ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ విభాగంలో వివిధ స్థాయిల్లో సేవలందించారు. 2010లో పార్టీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, ఆ తర్వాత 2013లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఆగస్టు 16న తమిళనాడు రాష్ట్ర విభాగం అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో రెండు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో ఆమె పోటీ చేసినప్పటికీ గెలవలేదు. ఇటీవల జరిగిన తమిళనాడు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ తరఫున ఆమె రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేశారు.