స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువే అన్న కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ నాలుక తెగ్గోయాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ ఓట్ల కోసమే కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఎవరో ఒకరు చేసిన పనికి మొత్తం కమ్యూనినీ నిందించడం సరికాదన్నారు. కమల్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, తమిళనాడులోని అరవకురిచిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది ఒక హిందువు అన్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే తొలి భారత హిందు ఉగ్రవాది అని పేర్కొన్నారు. కమల్ ప్రచారం చేసిన ఆ నియోజకవర్గంలో ముస్లింల మెజారిటీ ఎక్కువగా ఉండటంతో.. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు కమల్ మాత్రం ఓట్ల కోసం తాను ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఉన్న వాస్తవాన్ని చెప్పానని అంతకుముందు ప్రచార ర్యాలీలో వ్యాఖ్యానించారు.