తమిళనాడులో సినిమా వాళ్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తమిళ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంలు సినిమా వాళ్లే కావడం విశేషం. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖులు. అనంతరం విజయ్ కాంత్, కమల్‌హాసన్ వంటి హీరోలు కూడా రాజకీయ పార్టీలను ప్రారంభించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు.
తమిళనాడులో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ అభిమానులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అయితే వీళ్లందరూ ‘కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్’ కింద పనిచేస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కమాండర్ విజయ్ పీపుల్స్ మూమెంట్‌కు వేరే పార్టీతో ఎలాంటి పొత్తు లేదని.. అలాగే ఏ పార్టీ మద్దతు లేదని విజయ్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశాడు. తమ అభిమానులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారని.. వాళ్లకు మనస్ఫూర్తిగా ప్రచారం నిర్వహించాలని.. ఈ మేరకు జిల్లా నాయకులు, టీమ్ లీడర్లు, సిటీ, ఏరియా యూనియర్ లీడర్లు, వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశాడు. కాగా తమిళనాడులో ఫిబ్రవరి 19న పట్టణ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22న ఓట్ల లెక్కింపు జరగనుంది.