మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో బీజీగా ఉన్నాడు. దీని తర్వాత మరో రెండు రీమేక్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ కాగా, మరొకటి తమిళ హిట్ సినిమా ‘వేదాళం’. వీటిలో ‘వేదాళం’కి మెహర్ రమేశ్ దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు. ఎటొచ్చి, ‘లూసిఫర్’కే దర్శకుడి విషయంలో కాస్త అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్, వీవీ వినాయక్ రంగంలోకి వచ్చినప్పటికీ, ఆయనా సెట్ కాలేదు. ఈ క్రమంలో తాజాగా తమిళ యువ దర్శకుడు మోహన్ రాజాకి ఆ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.
తమిళంలో ఇప్పటికే కొన్ని హిట్ సినిమాలను రూపొందించిన మోహన్ రాజా ఇటీవల రామ్ చరణ్ తో ఓ సినిమా చేయడానికి ఆయనను కలుస్తున్నాడు. అయితే, ఇదే సమయంలో చిరంజీవి అతనికి ‘లూసిఫర్’ బాధ్యతలు అప్పగించినట్టు తాజా సమాచారం. దీంతో ప్రస్తుతం మోహన్ రాజా చిరంజీవి సినిమా స్క్రిప్టు విషయంలో పడినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయ్యాకనే, రామ్ చరణ్ తో ఈ దర్శకుడి సినిమా ఉంటుందని అంటున్నారు. కాగా మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ గతంలో చిరంజీవితో ‘హిట్లర్’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.