తమిళంలో వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆర్‌ఎస్ శివాజి మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శివాజి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు కోలివుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల కిందట తమిళంలో వచ్చిన పన్నీర్ పుష్పంగల్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శివాజి. అపూర్వ సగోదరార్గల్, మైకేల్ మదన కామరాజు, కొలమావు కొకిల, సూరరై పోట్రు, గార్గీ వంటి సినిమాలు శివాజికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ముఖ్యంగా గార్గీ సినిమాలో సాయి పల్లవి తండ్రిగా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక శివాజి తెలుగులో చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోకి సుందరిలో మాలోకం అనే కానిస్టేబుల్ పాత్రలో మెరిసాడు. కనిపించింది కాసేపే అయినా.. తన నటనతో నవ్వించాడు. ఆ తర్వాత తేజ దర్శకత్వంలో తెరకెక్కిన వెయ్యి అబద్దాలు సినిమాలో కీలకపాత్ర పోషించాడు. తెలుగులో ఆయన రెండు సినిమాల్లో మాత్రమే కనిపించాడు. చివరగా ఆయన యోగిబాబు హీరోగా నటించిన లక్కీ మ్యాన్ సినిమాలో కీలకపాత్ర పోషించాడు.
శివాజీ కేవలం నటుడిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్, సౌండ్ డిజైన్, లైన్ ప్రొడక్షన్ విభాగాల్లో పనిచేశాడు. ఎక్కువగా కమల్ హాసన్ సినిమాల్లో శివాజి నటించాడు.