కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వేలాది మంది కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం వారంతా పనుల్లేక పస్తులుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు తమవంతు సహాయం చేస్తున్నారు. ముంబైలో వేలాది కార్మికులు
ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ రెండోసారి పొడిగించినప్పుడు సైతం వీరంతా రోడ్లపైకి వచ్చి తమను స్వస్థలాలకు పంపాలని ఆందోళన చేసిన పరిస్థితి నెలకొంది. పోలీసుల జోక్యంతో వారిని చెదర గొట్టారు. అయితే ఇలాంటి వలస కూలీలు ముంబైతో పాటు హైదరాబాద్, ఢిల్లీ వంటి మహానగరాల్లో ఎక్కువగా ఉన్నారు.
ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులను ఆదుకోవడానికి మన టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ముందుకొచ్చారు. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి ముంబైలోని వలస కార్మికులకు అండగా నిలిచారు. ముంబైలోని 10 వేల మంది వలస కూలీల కోసం 50 టన్నుల ఆహారపదార్థాలను సిద్ధం చేశారు. కరోనా ప్రభావం కోట్లాది మంది జీవితాలపై పెను ప్రభావం పడింది. లాక్‌డౌన్ ఎత్తేసినా సాధారణ పరిస్థితులు రావడానికి చాలా సమయం పట్టొచ్చని నిపుణులు అంటున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని లెట్స్ ఆల్ హెల్ప్ సంస్థతో చేతులు కలిపినట్లు తమన్నా వెల్లడించారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు
తమన్నా.