ప్రముఖ కవి, పాటల రచయిత కందికొండ యాదగిరి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ సాయం ఉంటుందని సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కందికొండ శనివారం(మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌లో ఉంచారు.
తాజాగా ఆయన భౌతికకాయాన్ని మంత్రి తలసాని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కందికొండ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తూనే ఉందన్నారు. మంత్రి కేటీఆర్ ఆయన ఆసుపత్రి ఖర్చుల విషయంలో చొరవ చూపించారన్నారు. కానీ అనుకొని పరిస్థితుల్లో ఆయన మృతి చెందడం బాధాకరం అన్నారు. కందికొండ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని మంత్రి వ్యాఖ్యానించారు.
అయితే గతంలో ఆయన, తన కుటుంబం ఓసారి మంత్రి కేటీఆర్‌ను కలిసి తన కళ, ఆశయంతో పాటు ఉండటానికి నీడ కావాలని కోరారు. ఇక ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చోరవ తీసుకుని వారికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే కందికొండ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుందని, ఈ విషయంలో ఆయన అభిమానులు అధైర్య పాడాల్సి అవసరం లేదని మంత్రి తలసాని పేర్కొన్నారు.