‘సైరా నరసింహారెడ్డి’ మూవీ షూటింగ్‌ను కొంతమంది యువకులు అడ్డుకున్నారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న బహమని కోటలో యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంది. చిత్రీకరణలో భాగం కోటలో హిందూ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. అధికారుల నుంచి అనుమతి తీసుకుని చిత్రీకరణ ప్రారంభించారు. అయితే స్థానిక ముస్లిం యువకులు షూటింగ్‌కు సోమవారం అంతరాయం కల్గించారు. ముస్లిం కోటలో హిందూ దేవతల్ని నెలకొల్పడం ఏంటని యూనిట్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ మేరకు వారు పోలీసుల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు సెట్‌లోని దేవతల విగ్రహాల్ని తొలగించినట్లు చెబుతున్నారు.
చిరంజీవి ‘సైరా’ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిమాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. సుదీప్, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులోని అతిథి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నట్లు తెలిసింది. ఈ ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.