బడుగుల జీవితాలు బాగుచేయాలంటే ఆధ్యాత్మిక శక్తితోపాటు రాజకీయ శక్తి కావాలని శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. ఇవాళ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ’25 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై పోరాడాను. బడుగు బలహీన వర్గాల ప్రాంతాల్లో పర్యటించాను. అక్కడ సమభావం లేదని గుర్తించాను. కేవలం ఆధ్యాత్మికతతో ప్రజల్లో చైతన్యం తేలేమని అనుకున్నాను. అందుకే రాజకీయాల్లోకి రావాలని నిశ్చయించుకున్నాను’ అని చెప్పారు.
రాజకీయాల్లోకి రావాలంటే ఫాదరైనా, గాడ్ ఫాదరైనా ఉండాలని.. కానీ తనకు దేవుడి అండ మాత్రమే ఉన్నదని అన్నారు. రాజకీయాల్లోకి రావడంపై చాలా ఆలోచించానని ఆయన చెప్పారు. ‘రాజకీయాల్లోకి ప్రవేశంపై మా అమ్మను అడిగితే బీజేపీలో చేరమన్నారు. నా గురువును అడిగితే ఇదే సరైన సమయం అని చెప్పారు’ అని పరిపూర్ణానంద తెలిపారు. అమిత్ షా ఆదరించిన తీరు తనకు నిజంగా నచ్చిందని.. సొంత ఇంటికి తీసుకొని వెళ్లిన ఆయన.. తనకు ఎంతో గౌరవం ఇచ్చారని పరిపూర్ణానంద చెప్పారు. ‘బీజేపీ సూత్రాలు నాకు నచ్చాయి. అవినీతిపై ఆ పార్టీ చేస్తున్న పోరాటం నచ్చింది. కుల.. కుటుంబ వారసత్వాలు బీజేపీలో లేవు’ అని అన్నారు. తనకు ఏ పదవీ వద్దని.. కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బాటలో నడుస్తానని.. ఆయన ఏ గీత గీస్తే అదే తనకు లక్ష్మణ రేఖ అని చెప్పారు. త్వరలో జరిగే 5 రాష్ట్రాల్లో బీజేపీదే విజయమని అన్నారు. త్వరలో తెలంగాణ కాషాయ తెలంగాణగా మారబోతుందని పరిపూర్ణానంద అన్నారు.