‘నన్ను నేను దర్శకుడిగా నిలబెట్టుకోవడానికి ఎంత శ్రమించానో.. ఎంత తపనపడ్డానో ఇప్పుడూ అంతే తపనతో సినిమాలు చేస్తున్నాను. ఆడవారిని కించపరిచే విధంగా ఎప్పుడూ సినిమా తీయను. కొందరు నన్ను ఆ మార్గంలో సినిమా తీయమన్నారు. అచ్చిరెడ్డిగారు వద్దని చెప్పి, మన శైలిలో వెళితే ఎప్పుడో ఒకప్పుడు మార్గం దొరుకుతుందన్నారు. ఆయన నాకు దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను’ అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
బుధవారం (జూన్ 1) ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్‌డే. ఈ సందర్భంగా ఈ సినిమా సెట్స్‌లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అనంతరం ఎస్వీ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ”ఆర్గానిక్ మామ- హైబ్రీడ్ అల్లుడు’ కథ విని నిర్మాత కల్పనగారు నాన్‌స్టాప్‌గా నవ్వారు. ఈ సినిమా విడుదల అయినప్పుడు ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు. ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతూనే ఉంటాను. సోహైల్ మంచి కమర్షియల్ లక్షణాలున్న హీరో. మృణాళిని మంచి నటి’ అన్నారు. ‘ఎస్వీ కృష్ణారెడ్డిగారి కెరీర్‌కు ఈ సినిమా గొప్ప మలుపు కావాలి’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘ఈ సినిమా నా లైఫ్‌లో ఓ టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు సోహైల్. ‘మంచి ఎంటర్‌టైనింగ్ మూవీ చేస్తున్నందుకు హ్యాపీ’ అన్నారు కల్పన. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాళినీ రవి, నటుడు కృష్ణభగవాన్, కెమెరామేన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.