బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. శిసుశాంత్ తండ్రిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే హీరో కుటుంబం ఇలా స్పందించడం గమనార్హం. రియా చక్రవర్తి పేరును ప్రకటనలో ప్రస్తావించకపోయినా సుశాంత్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది.
సుశాంత్‌పై మానసిక రోగి ముద్ర వేసి, మృతదేహం ఫోటోలను బహిర్గతం చేసి తమకు సంతాపం తెలిపేందుకూ సమయం ఇవ్వలేదని పేర్కొంది. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించింది. తమ కుటుంబం పోలీసులను ముందుగానే సంప్రదించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖలో ప్రశ్నించారు. సుశాంత్ నలుగురు అక్కలతో పాటు తండ్రినీ బెదిరిస్తున్నారని, తమ కుటుంబం ప్రతిష్ట మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుశాంత్ జ్ఞాపకాలకూ కళంకం ఆపాదిస్తున్నారని మండిపడింది. ఇక సుశాంత్ ఆయన సోదరిల గురించి లేఖలో ప్రస్తావిస్తూ పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటారని, రెండో కుమార్తె జాతీయ క్రికెట్ టీమ్‌లో ఆడారని, మూడో కుమార్తె లా చదవగా, నాలుగో కుమార్తె ష్యాషన్ డిజైనింగ్‌లో డిప్లమో చేశారని ఈ ప్రకటన పేర్కొంది. ఐదో సంతానంగా సుశాంత్ తన తల్లికి గారాల బిడ్డని తెలిపింది. తమ కుటుంబం ఏ ఒక్కరి నుంచి ఏమీ ఆశించలేదని, ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టం చేసింది. జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో మృతిచెంది కనిపించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తం కావడంతో ముంబై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. సుశాంత్ కుటుంబ సభ్యులు, పనివాళ్లు, బాలీవుడ్ ప్రముఖులు సహా ఇప్పటికే దాదాపు 56 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. మరోవైపు సుశాంత్ మృతిపై సీబీఐ, ఈడీ సంస్థలు సైతం కేసులు నమోదు చేశాయి.