మెగా డాటర్ నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సూర్యకాంతం’. బి. ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నారు. సినీ నటుడు, నిహారిక సోదరుడు వరుణ్‌తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ‘మీ పేరేంటండి’ అని రాహుల్ నిహారికను అడిగితే.. ‘నా పేరు తెలుసుకుని ఏం చేస్తావ్? నీకు పుట్టబోయే పిల్లలకి పెట్టుకుంటావా?’ అని వెటకారంగా అనడం నవ్వులు పూయిస్తోంది.
ఆ తర్వాత ‘నీ గురించి చెప్పు’ అని నిహారిక రాహుల్‌ను అడుగుతుంది. అతను పేరు చెప్పగానే.. ‘చాల్లే ఆపు. ఇంతకంటే ఎక్కువ తెలుసుకుని నేనేం చేస్తా’ అనడం ఫన్నీగా ఉంది. టీజర్ చివర్లో ‘ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నిజంగానే చెయ్యి కోసుకుంటాను’ అని నిహారిక తల్లి పాత్రలో నటించిన సుహాసిని బెదిరిస్తుంటారు. నిహారిక ఆమెను ఆపాల్సిందిపోయి ‘12345..కోస్కో’ అంటూ రెచ్చగొట్టడం కామెడీగా ఉంది. సందీప్ ఎర్రం రెడ్డి, రామ్ నరేష్, సృజన్ ఎర్రబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.