ప్రముఖ సినీ నటుడు సూర్య కుమారుడు దేవ్ సినిమాల్లోకి రాబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. ఎనిమిదేళ్ల దేవ్ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఓ ఎనిమిదేళ్ల బాలుడికి కుక్కపిల్లకి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో సినిమా ఉండబోతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ సినిమా కోసం గతంలో 2డి ఎంటర్టైన్మెంట్ సంస్థ చైల్డ్ ఆర్టిస్ట్‌లను పిలిపించి ఆడిషన్ నిర్వహించింది. మొత్తానికి సూర్య కుమారుడిని ప్రధాన పాత్రలో ఎంపిక చేసినట్లు టాక్. దేవ్‌తో పాటు సినిమాలో మరో 30 మంది పిల్లలు నటించనున్నారట. అయితే ఈ విషయంపై సూర్య అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే పలువురు సూపర్స్టార్ల వారసులు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టేశారు. విక్రమ్ కుమారుడు ధృవ్ “వర్మ” చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక విజయ్ కుమారుడు సంజయ్ దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారు.