కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా చంద్రు అనే అడ్వకేట్ బయోపిక్‌తో అద్భుతమైన విజయం సాధించాడు. నిజ జీవితంలో అన్యాయంగా జైలుపాలైన భర్తను కాపాడుకునేందుకు ఓ గిరిజన మహిళ చేసిన పోరాటంలో.. చంద్రూ అనే అడ్వకేట్ నిస్వార్థంగా ఆమెకు సాయం చేసి తన తరపున కోర్టులో వాదించి గెలిచిన ఓ కేసును స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య.
ఈ సినిమాతో రియల్ పాత్రలు కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సినిమాలో సినతల్లి పాత్రకి నిజ జీవితంలో పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్ఫూర్తి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు పోషించలేక, వృద్ధాప్యంతో చాలా కష్టాల్లో ఉంది. ఈ సినిమాతో తన గురించి బయటి ప్రపంచానికి తెలియడంతో హీరో, కొరియోగ్రఫర్ రాఘవ లారెన్స్ ఆమెకు సొంత ఇల్లు కటిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సూర్య సైతం పార్వతి అమ్మాళ్‌కు అండగా నిలిచాడు. తన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి.. మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీ పార్వతి అమ్మాళ్‌కు చేరేలా చేశాడు.
అంతేగాక తన తదనంతరం ఆమె పిల్లలకు ఈ వడ్డీ అందజేస్తామని సూర్య తెలిపారు. ఇప్పటికే అగరం ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల్ని చేపడుతున్నాడు. ఇవి మాత్రమే కాక తరచూ విరాళలు ప్రకటిస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటాడు. కరోనా సమయంలో కూడా తనవంతుగా కోటీ రూపాయలు ప్రకటించి తమిళ నాడు ప్రభుత్వానికి అండగా నిలిచాడు. అంతేగాక జై భీమ్ చిత్రం స్ఫూర్తితో గిరిజనుల సంక్షేమం కోసం కూడా సూర్య కోటీ రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.